ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో రాజకీయ ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ఎన్నికలకు మరో ఆరు నెలలే సమయం ఉండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వీలైనంత త్వరగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.
పోలవరం నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 42, 070 ఓట్ల మెజారీటీతో వైసీపీ అభ్యర్థి తెల్లం బాలరాజు ఇక్కడ గెలుపొందారు. ఎమ్మెల్యే బాలరాజు 2004, 2009 సాధారణ ఎన్నికలలో, 2012లో జరిగిన ఉప ఎన్నికలలో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. అనంతరం 2014లో టీడీపీ అభ్యర్థి మోడియం శ్రీనివాసరావుపై ఓటమిపాలయ్యారు. అనంతరం 2019లో జరిగిన ఎన్నికలలో బొరగం శ్రీనివాస్‌పై అత్యధిక మెజారీటీతో గెలుపొందారు. ఇప్పుడు మరో ఆరు నెలల్లో జరిగే ఎన్నికలకు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది జనవరిలో అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే బాలరాజు కొంతకాలం ప్రజలకు దూరంగా ఉన్నారు. అనంతరం కోలుకున్న వెంటనే మళ్లీ ప్రజల వద్దకు వెళ్తూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజల దగ్గరకు వెళ్తున్నారు. ఈ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇటీవల గోదావరి వరదల కారణంగా అతలాకుతలమైన ముంపు ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలకు ప్రభుత్వం నుంచి సాయం చేసేందుకు కృషి చేశారు. కోతలకు గురైన రోడ్ల మరమ్మతులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పోలవరం నిర్వాసిత ప్రాంతాల వారికి అండగా నిలబడాతమని చెప్పారు. అదే సమయంలో మరికొన్ని గ్రామాల ప్రజలు తమకు సరైన సదుపాయాలు అందలేదని ఎమ్మెల్యేని నిలదీశారు. బురద నీళ్లు తాగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సదుపాయాలు కల్పించలేదంటూ ఎమ్మెల్యేపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఇటీవల బోయ వాల్మీకులను గిరిజన తెగల్లో కలుపుతూ వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానంపై ఏజెన్సీ ప్రాంతాలలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలలో కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. బోయ వాల్మీకులను గిరిజనుల్లో కలపొద్దని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. వైసీపీ గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీ తక్షణమే రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు చేశారు.
మరోపక్క ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీకి కూడా పోలవరంలో మంచి ఫాలోయింగ్ ఉంది, 2014లో తెల్లం బాలరాజుపై మోడియం శ్రీనివాసరావు 15,720 ఓట్ల మెజారీటీతో గెలుపొందారు. 2019లో బొరగం శ్రీనివాస్‌కు టికెట్ ఇవ్వగా ఆయన తెల్లం బాలరాజు చేతిలో ఓటమిపాలయ్యారు. కానీ నిత్యం ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుందుకు బొరగం శ్రీనివాస్ కృషి చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ ఇటీవల చేపట్టిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంతో ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరిస్తున్నారు. ఈసారి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. సంక్షేమ పథకాల పేరుతో వైసీపీ నాయకులు తమ జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. వైసీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని ప్రజలను కోరుతున్నారు. ఓ పక్క వైసీపీ ప్రభుత్వం బోయ వాల్మీకులను గిరిజనులలో కలపటంతో వైసీపీకి ఉన్న వ్యతిరేకత బొరగం శ్రీనివాస్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. చంద్రబాబుతో ములాఖత్ అనంతరం జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని పవన్ ప్రకటించారు. ఈ రెండు పార్టీలు కలిసి రావటంతో ప్రస్తుత అధికార పక్షానికి గట్టి పోటీ ఇవ్వనున్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు బొరగం శ్రీనివాస్ పోలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు చిరంజీవి, పవన్ అభిమానులతో కలిసి టీడీపీ ఓటు బ్యాంకుతో తప్పకుండా గెలుస్తామని బొరగం శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి పోలవరం నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారో..
0 Comments