Ad Code

Sports News: హిస్టోరికల్ వార్ మొదలవబోతుంది. ప్రపంచకప్ ఎలా మొదలైంది? తొలి విజేత ఎవరు?

world cup 2023 latest news

10 జట్లు.. 48 మ్యాచ్‌లు.. క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నమెంట్.. క్రికెట్ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించే టోర్నీ.. అదే వన్డే ప్రపంచ కప్. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ వరల్డ్‌కప్‌  పండుగని సెలబ్రేట్ చేసుకోవడానికి దేశం మొత్తం రెడీ అవుతోంది. ఎందుకంటే ఈ టోర్నీ 2023 సీజన్.. ఈ నెల 5వ తేదీ నుంచి మొదలుకానుంది. మరి అలాంటి టోర్నీ గురించి మీకు తెలిసిన విషయాలేంటి..? దీని చరిత్ర గురించి మీకేం తెలుసు..? ఇది ఎప్పుడు మొదలైంది..? ఎలా మొదలైంది..? అసలు మొట్టమొదటి వరల్డ్‌కప్‌ టోర్నీ ఎప్పుడు, ఎక్కడ జరిగింది..? అలాగే మొదటి ప్రపంచకప్‌ టోర్నీలో మొట్టమొదటి మ్యాచ్ ఆడిన దేశాలేవి..? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు స్పెషల్ మ్యాగజైన్‌లో తెలుసుకుందాం.

* ప్రపంచకప్ ఎలా మొదలైంది..?

క్రికెట్ పుట్టుక 16వ శతాబ్దంలో జరిగినా.. అధికారికంగా దేశాల మధ్య టోర్నీలు జరగడం మాత్రం 1877లో మొదలైంది. మొదటిసారిగా టోర్నీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగింది. అది ఒక టెస్ట్ సిరీస్. ఆ టోర్నీకే ఆ తర్వాత కాలంలో యాషెస్ సిరీస్‌గా పేరు పెట్టారు. అలాగే, 1900 కాలంలో ఒలింపిక్ గేమ్స్‌లో కూడా క్రికెట్ ఆడారు. ఆ తర్వాత క్రికెట్ ఆడే దేశాల సంఖ్య క్రమంగా పెరగడంతో నెమ్మదిగా ద్వైపాక్షిక టోర్నీలు మొదలయ్యాయి. దీంతో వెస్టిండీస్, న్యూజిలాండ్, భారత్, పాకిస్తాన్ వంటి దేశాలు కూడా టెస్ట్ క్రికెట్ ఆడడం మొదలుపెట్టాయి. అయితే 1960లో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో వన్డే క్రికెట్ మొదలైంది. అది సక్సెస్ కావడంతో ఆ తర్వాత చాలా దేశాలు వన్డే క్రికెట్ ఆడాయి. అప్పట్లో వన్డే మ్యాచ్‌ 40 ఓవర్ల పాటు సాగేవి. ఒక్కో ఓవర్లో 8 బంతులుండేవి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ)కి కూడా ఈ ఫార్మాట్ బాగా నచ్చింది. దాంతో ద్వైపాక్షిక, త్రైపాక్షిక టోర్నీలే కాకుండా ఇక ఏకంగా అన్ని దేశాలూ కలిసి పోటీపడేలా ఓ వరల్డ్‌కప్‌ ఆడించాలని ప్లాన్ చేసింది. అలా 1975లో వన్డే వరల్డ్‌కప్‌ మొదలైంది. అప్పట్లో దీన్ని ప్రుడెన్షియల్ వరల్డ్‌కప్‌ అని పిలిచేవాళ్లు. దీనికోసం ఈ టోర్నీని 60 ఓవర్లకు పెంచడమే కాకుండా.. ఓ ఓవర్లో 6 బంతులు ఉండేలా రూల్ తీసుకొచ్చారు.

* మొట్టమొదటి వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్ ఆడిన దేశాలేవి..?

1975లో వన్డే క్రికెట్ ప్రపంచకప్ మొదలైనప్పటి నుంచి ప్రతి నాలుగేళ్లకొకసారి జరుగుతున్న ఈ టోర్నీ.. ఇప్పటివరకు మొత్తం 12 సార్లు జరిగింది. మొదటిది 1975, రెండోది 1979, ఆ తర్వాత 1983, 1987, 1992, 1996, 1999, 2003, 2007, 2011, 2015, 2019. ఈ ఏడాది అంటే 2023లో జరగబోయే టోర్నీ 13వది. అయితే ఈ టోర్నీలన్నింటిలో 1992, 99 ప్రపంచకప్ టోర్నీలకి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. నిజానికి 1987 తర్వాత 1991లో ప్రపంచకప్ జరగాలి. కానీ వరల్డ్‌కప్‌ టోర్నీలను వేసవి కాలంలో నిర్వహిస్తే బాగుంటుందని భావించిన ఐసీసీ.. టోర్నీని ఆ తర్వాత ఏడాది.. అంటే 1992 ఫిబ్రవరి-మార్చి నెలల్లో నిర్వహించింది. అలాగే, 1996 తర్వాత 2000లో వరల్డ్‌కప్‌ జరగాల్సి ఉంది. కానీ, అదే ఏడాది ఒలింపిక్స్ కూడా జరగాల్సి ఉండడంతో టోర్నీని ఓ ఏడాది ముందే.. అంటే 1999లోనే వరల్డ్‌కప్‌ నిర్వహించడం జరిగింది.

* 1975 వరల్డ్‌కప్‌లో మొదటి మ్యాచ్ ఆడిందెవరు..?

మొట్టమొదటిసారి జరిగిన టోర్నీలో ఇంగ్లాండ్, ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్టిండీస్, న్యూజిలాండ్ దేశాలు పూర్తి సభ్యత్వం గల జట్లుగా బరిలోకి దిగితే.. శ్రీలంక, ఈస్ట్ ఆఫ్రికా దేశాలు అతిథి దేశాలుగా ఆహ్వానించడం జరిగింది. ఇక టోర్నీలో తొలి మ్యాచ్ భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది.

* తొలి విజేత విండీస్:

1975 ప్రపంచ కప్‌లో 8 జట్లు పోటీ పడ్డాయి. గ్రూప్ స్టేజ్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్లు బాగా ఆడి సెమీ ఫైనల్ చేరాయి. అక్కడ ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్‌ని ఓడించి ఫైనల్ చేరగా, న్యూజిలాండ్‌ని ఓడించి వెస్టిండీస్ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ఫైనల్లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా పోటాపోటీగా తలపడినా.. చివరికి వెస్టిండీస్ విజేతగా నిలిచి.. మొట్టమొదటి వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టుగా చరిత్రకెక్కింది.

* 1983లో విశ్వవిజేతగా భారత్:

భారత క్రికెట్ చరిత్రలో 1983 వన్డే ప్రపంచకప్ ఓ అద్భుతం అనే చెప్పాలి. 1975, 1979లలో జరిగిన 2 ప్రపంచకప్‌లను వెస్టిండీస్ సొంతం చేసుకుని డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది. అలాగే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ దేశాలు బలమైన జట్లుగా టోర్నీలో అడుగుపెట్టాయి. అయితే, ఎవ్వరూ ఊహించని విధంగా ఈ బలమైన జట్లన్నింటినీ ఓడించి భారత్ ప్రపంచకప్‌ను ముద్దాడింది. నిజానికి 1979లో భారత్ గ్రూప్ స్టేజ్‌లో ఆడిన 3 మ్యాచ్‌లు ఓడి ఇంటిదారి పట్టింది. దీంతో 1983లో టీమిండియా గెలుపుపై ఏ మాత్రం అంచనాలు లేవు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే.. భారతీయ క్రికెట్ అభిమానులు కూడా వెస్టిండీస్‌ జట్టుని, ఆ జట్టు ఆటగాళ్లనే ఇష్టపడేవాళ్లు. ఆ జట్టుకే సపోర్ట్ చేసేవాళ్లు. అలాంటి సమయంలో గ్రూప్ స్టేజ్‌లో ఆస్ట్రేలియా, విండీస్ లాంటి బలమైన జట్లను ఓడించి భారత్ సెమీ ఫైనల్ చేరింది. అక్కడ ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్ చేరడమే కాకుండా.. ఫైనల్లో పటిష్టమైన విండీస్ జట్టును మట్టికరిపించి విశ్వ విజేతగా నిలిచింది. దీంతో భారత్‌లో క్రికెట్‌కి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. క్రికెట్ ఓ ఆటగా కాకుండా ఓ మతంగా మారిపోయింది.

* 5 సార్లు విశ్వవిజేత ఆస్ట్రేలియా:

వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియాది ఓ ప్రత్యేకమైన స్టోరీ. 1975లో జరిగిన మొదటి టోర్నీలోనే ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా కప్పు కొట్టడంలో మాత్రం ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత 79, 83 సీజన్‌లలో కనీసం సెమీఫైనల్ కూడా చేరలేకపోయింది. కానీ 1987లో మాత్రం ఎట్టకేలకు అన్ని జట్లని ఓడించి వరల్డ్‌కప్‌ పట్టేసింది. ఆ తర్వాత 1992లో పాకిస్తాన్, 1996లో శ్రీలంక జట్లు వరల్డ్‌కప్‌ విజేతలుగా నిలిచాయి. కానీ, ఆ తర్వాత 1999 నుంచి 2007 వరకు.. అంటే వరుసగా 3 సార్లు అన్ని దేశాలను ఓడించి వన్డే వరల్డ్‌కప్‌ని ఆస్ట్రేలియా జట్టు సొంతం చేసుకుంది. అయితే ఆస్ట్రేలియా విన్నింగ్ స్ట్రీక్‌కి మళ్లీ భారత జట్టే బ్రేక్ వేసింది. 2011లో ధోనీ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా.. అద్భుత ప్రదర్శనతో వరల్డ్‌కప్‌ పట్టేసింది. దీంతో రెండోసారి ప్రపంచకప్ గెలుచుకోవాలని 28 ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారత క్రికెట్ అభిమానుల కల నెరవేరింది.

* టీమిండియా పోరాటానికి మరోసారి దక్కిన గౌరవం:

1983 వరల్డ్‌కప్‌ తర్వాత 2003లోనే భారత్ రెండోసారి కప్పు గెలిచే అవకాశం వచ్చింది. ఆ ఏడాది టోర్నీలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తుఫాన్ బ్యాటింగ్‌తో భారత్‌ను ఫైనల్ చేర్చాడు. కానీ, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత బౌలర్లు తేలిపోవడంతో ఓటమి తప్పలేదు. ఇక 2007లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా గ్రూప్ స్టేజ్‌లోనే బంగ్లాదేశ్, శ్రీలంక చేతిలో ఓడి ఘోర పరాభవంతో ఇంటి దారి పట్టింది. కానీ, 2011లో ధోనీ కెప్టెన్సీలో బరిలోకి దిగిన భారత్.. టోర్నీ ఆరంభంలోనే అదరగొట్టింది. ముఖ్యంగా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్.. ఇలా అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. ఇక ఫైనల్లో శ్రీలంకపై సచిన్ టెండుల్కర్, సెహ్వాగ్ లాంటి కీలక ఆటగాళ్లు తక్కువ స్కోర్లకే అవుటైనా.. గౌతం గంభీర్ 97 రన్స్‌తో ఇన్నింగ్స్ నిలబెట్టాడు. ఆ తర్వాత ధోనీ కూడా దూకుడుగా ఆడి 92 రన్స్ బాది జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా.. మరపురాని సిక్స్‌తో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు.

* 2023 వరల్డ్‌కప్‌ గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్:

ఈ ఏడాది వరల్డ్‌కప్‌ మొత్తం 10 జట్ల మధ్య జరగనుంది. ఇందులో ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు నేరుగా టోర్నీకి అర్హత సాధించగా.. శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు క్వాలిఫయర్స్‌లో గెలిచి టోర్నీకి అర్హత సాధించాయి. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే.. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో వెస్టిండీస్ జట్టు మొట్టమొదటిసారిగా ఈ టోర్నీలో అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫయర్ సిరీస్‌లో ఓడిపోవడంతో విండీస్ ఐసీసీ వరల్డ్‌కప్‌ నుంచి వైదొలగాల్సి వచ్చింది.  

* 2023 ప్రపంచకప్ భారత్ గెలవగలదా..?

అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కాబోతున్న ప్రపంచకప్ 13వ సీజన్‌లో భారత్ కచ్చితంగా ఫేవరెట్ జట్టే. అయితే, ఈ సీజన్‌లో భారత్ కప్పు కొట్టగలదా..? అంటే.. అవకాశాలున్నాయనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం భారత్ అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ బలంగా ఉంది. ఇక భారత్‌తో పోల్చితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి జట్లు తప్ప మిగిలిన జట్లు అంత బలంగా లేవు. దీనివల్ల 2023లో ప్రపంచకప్ గెలవడం భారత్‌కి సాధ్యమే. కానీ, ఇది పూర్తిగా భారత క్రికెటర్ల పెర్ఫార్మెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఆటగాడు వంద శాతం కష్టపడి ఆడితే కచ్చితంగా ఈ సీజన్‌లోనూ కప్పు మనదే..!

ఇది ప్రపంచ కప్ స్టోరీ. మరి ఇంత చరిత్ర ఉన్న వరల్డ్‌కప్‌, మనందరం ఎంతగానో ఇష్టపడే మెగా క్రికెట్ టోర్నీని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి. అలాగే అందరం కలిసి భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలవాలని, వరల్డ్‌కప్‌ను ముద్దాడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

జైహింద్.

Post a Comment

0 Comments